డా. సినారె జీవన రేఖలుచిన్న ఝరం గిరులు దూకి జీవనదిగ మారినట్లు

బీజం మట్టిపొర చీల్చి భూజంగా మారినట్లు

చుక్క ఎదిగి ఎదిగి పూర్ణ సుధాంశునిగ మారినట్లు

పరమాణువు పెరిగి మహాపర్వతముగ మారినట్లు

సరసి మహాతపమొనర్చి సంద్రంగా మారినట్లు

క్రమముగ ఆ వామనుడు విరాణ్మూర్తిగ మారినట్లు

పిన్ననాటి ఒక సినారె విశ్వ కవనమూర్తి యయ్యె.

About Me


జననం

డా. సి. నారాయణరెడ్డి గారు కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో కర్షక కుటుంబంలో ప్రజోత్పత్తి నామ సంవత్సర నిజాషాఢ పౌర్ణమి (గురుపూర్ణిమ)నాడు, అనగా 29.7.1931 నాడు ఉదయం 4-5 గంటల మధ్య జన్మించారు. తల్లి శ్రీమతి బుచ్చమ్మగారు – ‘‘బ్రతికినంత కాలము బంగరుమమతల పొంగించిన పాలవెల్లి. తండ్రి శ్రీ మల్లారెడ్డిగారు – అరకపట్టిన రైతు. ‘‘పదుగురు పాలేర్లున్నా పదరా’’ – అని స్వయంగా రేగడిని దున్నే కృషీవలుడు. ‘నల్లని రేగళ్ళు దున్ని’, నారాయణరెడ్డి ‘‘బత్రుకున రవ్వలు పండించిన కర్షకమణి’’ శ్రీమల్లారెడ్డిగారు.

నారాయణరెడ్డిగారి ఇంటిపేరు సింగిరెడ్డి. శ్రీమతి బుచ్చమ్మగారికి మొదట ఒక మగపిల్లవాడు పుట్టి పోవడమూ, మళ్ళీ ఆరేళ్ళ వరకు కాన్పు కాకపోవడంతో, బుచ్చమ్మగారు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నారు. కొడుకు పుట్టడంతో సత్యనారాయణరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో కొడుకును చేర్పించేటప్పుడు శ్రీ మల్లారెడ్డిగారు ‘సి.నారాయణరెడ్డి’ – అని రిజిష్టరులో వ్రాయించారు. ‘సత్యనారాయణరెడ్డి’ అనే పేరులోని సత్యం నారాయణరెడ్డి కవిత్వంలో సౌందర్యంగా రూపుదిద్దుకుని స్థిరపడిందని భావించవచ్చు. ‘సింగిరెడ్డి’లోని ‘సింగి’ చైతన్యానికి సంకేతం. అందుకే నారాయణరెడ్డి ‘‘ఇంటిపేరు చైతన్యం’’ – అన్నారు. హనుమాజిపేటలో ఆనాడు ప్రభుత్వ పాఠశాల లేనందువల్ల, వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు నడుపుకుంటున్న వీధిబడిలో నారాయణరెడ్డి చదువుకు శ్రీకారం చుట్టి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత – సిరిసిల్లలో ఉరుదూ మాధ్యమంలో తెలుగును ఒక ఐచ్ఛిక విషయంగా గ్రహించి, మాధ్యమిక స్థాయి విద్యను అభ్యసించారు. కరీంనగర్లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు 1948లో.

కవితారచన.... తొలి అడుగులు

నారాయణరెడ్డి గారిలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, ఆశుగణం, గానశీలం ఉన్నాయి. చిన్నప్పటినుండి మట్టిలో పుట్టిన జానపదగీతాలను ఆలపించే వారు. హరికథలు, బుర్రకథలంటే చెవికోసుకునేవారు. హరికథా కథనాన్ని అనుకరించేవారు ఆశువుగా సంగీతాత్మకంగా. వేములవాడ వాస్తవ్యులు శ్రీ చౌటి నరసయ్యగారి హరికథాగానం నారాయణరెడ్డిగారికి ఛందస్సు పట్ల మక్కువ, అభిరుచి కలగడానికి ప్రేరకమైంది. ఆరేడు తరగతుల నుండే కవితలు వ్రాయడం మొదలుపెట్టారు. ఛందస్సంటే తెలియనిదశ అది. ఏడవ తరగతిలో సీస పద్యమని తెలియని దశలో –

                       ఒకనాడు ఒక నక్క ఒక అడవి లోపల
                             ఫొట్టకోసర మెటో పోవుచుండె

అనే పంక్తితో ప్రారంభించి పద్యం వ్రాస్తే – అది సీసపద్యమని తెలిసి ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను తెలిపారు శ్రీ దూపాటి వేంకట రమణాచార్యులు గారు. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వ్రాసిన–

మారుటెన్నడో
విషంపు గుండెలీ జగాన
మారుటెన్నడో

అనేది నారాయణరెడ్డిగారి తొలి గేయం. వారు పదవ తరగతిలో ఉన్నప్పుడు –

వెన్నవంటి మనసున్నవానికి
అన్నమేమొ కరువాయె
ఉన్నవానికింతన్న వీడుదా
మన్న గుండె లేదాయె

వంటి పాటలు రాశారు. కరీంనగర్ విద్యార్థి మహాసభలో –

విజయంబు సాధించినావా – విద్యార్థి
నీ వీర భావాలు నింగి వ్యాపించగా
నీ వైరిచిత్తాల నేల కంపించగా

వంటి గేయాలు రచించి పాడారు. గాంధీజీని గూర్చి పద్యాలూ గేయాలూ రచించారు.

మారాలి మారాలి మారాలిరా
కరుడు గట్టిన నేటి కరకు సంఘపు రంగు
మారాలి మారాలి మారాలిరా

వంటి ఎన్నో గీతాలు వ్రాశారు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాస కాలంలోనే, నైజాం రాష్ట్రానికి స్వాతంత్ర్యం రావాలని జరిపిన విద్యార్థుల సత్యాగ్రహంలో నారాయణరెడ్డి గారు పాల్గొని, అడ్లూరి అయోధ్యరామకవి వ్రాసిన–

సైనికులం మేం సైనికులం
జాతీయ భారత సైనికులం
స్వచ్ఛంద భారత సేవకులం

అనే గేయాన్ని గానం చేశారు. నారాయణరెడ్డిగారు హైదరాబాదు ఛాదర్ఘాట్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ మీడియటును (1948–49) ముగించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో శ్రీ జువ్వాడి గౌతమరావు గారి సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో నారాయణరెడ్డి గారి కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ఈ దశలోనే నారాయణరెడ్డి గారు హిందీ పాటలకు తెలుగు పదాలలో పాటలు గూర్చి పాడేవారు. ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ (హైదరాబాదు) అనే గ్రంథాలయంలో సభ్యులుగా చేరి, రాయప్రోలు, గురజాడ, కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ, కరుణశ్రీ – వంటి భావకవుల, అభ్యుదయ కవుల రచనలను ప్రథమంగా చదివారు. అంతకుముందే – ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్యనాటికలను వ్రాశారు నారాయణరెడ్డిగారు. ‘భలేశిష్యులు’ వంటి సాంఘిక నాటికలను రచించారు; వాటిని ప్రదర్శించారు; ప్రదర్శనలో నటులుగా తామూ పాత్రధారణ చేశారు.

నారాయణరెడ్డిగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలోనే ‘బి.ఏ.’ (1952) చదివారు. బి.ఏ. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సాహితీ సంచిక – ‘శోభ’కు సంపాదకత్వం నిర్వహించారు. ‘శోభ’పత్రికలో నారాయణరెడ్డిగారు ‘రోచిస్’, ‘సింహేంద్ర’ – అనే మారుపేర్లతో రచనలు చేశారు. వారు 1954లో ఎం.ఏ. పట్టా పొందారు. ఎం.ఏ. విద్యార్థిగా ‘సినీకవి’ అనే నాటికను వ్రాసి, ‘మకరందమూర్తి’ అనే పాత్రను ధరించి, దర్శకత్వం వహించి, ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. ‘ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థి సమితి’కి, ఆ తరువాత తెలంగాణా రచయితల సంఘానికీ కార్యదర్శిగా పనిచేశారు.

దాశరథితో అనుబంధం

ఎం.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు నారాయణరెడ్డిగారికి మహాకవి దాశరథి సాహచర్యం లభించింది. నారాయణరెడ్డి గారికి దాశరథి గారు అండగా, ఆదర్శంగా నిలబడిన వ్యక్తి. దాశరథిగారినీ, నారాయణరెడ్డిగారినీ ఆ రోజుల్లో ‘తెలంగాణా నయనయుగళం’గా భావించింది కవిలోకం. నారాయణరెడ్డిగారు తమలో ‘‘పాదుకున్న సాహిత్యానికి చిహ్నంగా’’, ‘జలపాతం’ కావ్యాన్ని ఆ మహాకవికి అంకితం చేశారు –

నా తరుణ కావ్యలతిక లానాడు పైకి
ప్రాకలేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి లేతరేకులకు కెంజాయ లద్ది
మించు పందిళ్ల పైకి ప్రాకించినావు

అనే పద్యంలో దాశరథిగారు తమకు అందించిన సహకారాన్ని తెలుపుకున్నారు నారాయణరెడ్డిగారు.

కలకాలమ్ములు నీవు నేనిటులె స్నిగ్ధస్నేహబంధాల బ
ద్ధులమై యుందము; ఏకగీతి నిరు గొంతుల్ విప్పి విన్పింత, మాం
ధ్రుల చైతన్య విపంచి కావళులు విద్యున్నాదముల్ సేయగా
జలపాతమ్ముల వోలె దూకుదము విష్వక్సాహితీ శృంగముల్

అనే పద్యంలో దాశరథికీ తమకూ గల స్నేహబంధాన్ని వ్యక్తం చేశారు నారాయణరెడ్డిగారు. ఆచార్య కె. గోపాలకృష్ణారావు, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారలు నారాయణరెడ్డిగారి గురువులు.

ఆచార్యత్వం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేసిన నారాయణరెడ్డిగారు 1954–55లో కొంతకాలం, సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరరుగా పనిచేసి, అదే కాలేజీలో 1955లో ఆంధ్రోపన్యాసకులుగా ఉద్యోగమారంభించారు. 1958–59లో నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉపన్యాసకులుగా ఉంటూనే నారాయణరెడ్డిగారు 1957 నుండి 1962వరకు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సూచనను అనుసరించి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి పర్యవేక్షణలో – ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే విషయంపై పరిశోధన సాగించి, 1962లో పిహెచ్.డి. పట్టాను పొందారు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో వారు ‘రీడర్’ అయ్యారు. 1976లో ఆచార్యులయ్యారు. 1981 వరకు ఆచార్యులుగా బోధన సాగించారు.

కుటుంబం

నారాయణరెడ్డిగారి కుటుంబం గూర్చి కొంత ప్రస్తావించాలి ఈ సందర్భంలో. నారాయణరెడ్డిగారి భార్య శ్రీమతి సుశీల దివంగతురాలు. ఆమె స్మృత్యంకంగా ‘‘శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు’’ను స్థాపించారు నారాయణరెడ్డిగారు. ప్రతి ఏటా ఆ ట్రస్టు ఉత్తమ రచయిత్రికి 50 వేల రూపాయల నగదు పురస్కారం అందజేస్తున్నది. ఆమె పేరిట డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్వర్ణ పతకాలు ఏర్పాటు చేయబడినాయి.

నారాయణరెడ్డిగారికి నలుగురు కూతుళ్ళు – శ్రీమతులు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని; అల్లుళ్ళు – శ్రీయుతులు భాస్కరరెడ్డి, సురేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారలు. నారాయణరెడ్డి తల్లి బుచ్చమ్మగారే నారాయణరెడ్డి పెద్ద కూతురు – ‘గంగ’గా పుట్టిందా అన్నట్లుగా, పెద్దకూతురు శ్రీమతి గంగ గారు, నారాయణరెడ్డి గారితో పాటు, అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటారు. అందుకే నారాయణరెడ్డిగారు తమ ‘సినారె గజళ్ళు’ కావ్యాన్ని శ్రీమతి ‘గంగ’కు అంకితం చేస్తూ

నన్నే కన్నయ్యగ తన
కన్నుల ఒడిలో పొదిగిన
గంగకు అర్పింతును నా
గజళ్ళు ఎదలోన ముడిచి
ఋణవిముక్తికై చేసిన
కృతి సమర్పణం కాదిది
తల్లి నోట ముద్దలిడే
పిల్లవాని చాపల్యం

అని అన్నారు. మనుమలతో, మునిమనుమళ్ళతో, మనుమరాళ్ళతో, మునిమనుమరాళ్ళతో నారాయణరెడ్డిగారి ఇల్లంతా సందడిగా ఉంటుంది.
ఆచార్యునిగా, ఇంకా పదకొండు సంవత్సరాల భాషా సాహిత్యసేవ చేయవలసిన కాలం ఉండగా, నారాయణరెడ్డిగారి జీవితం ఒక మలుపు తిరిగింది. ఆచార్య నారాయణరెడ్డిగారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అధికార భాషా సంఘాధ్యక్షపదవిని జన్మదినోత్సవ  ఉపాయనంగా అందించింది. ఆ జన్మదినోత్సవ సన్మాన సభలో నారాయణరెడ్డిగారు –

ఎవరికి ఈ సన్మానం
ఎందుకు ఈ సన్మానం
చెట్టంతటి పేరొందిన
చిగురుకు ఈ సన్మానం

అని ప్రారంభించి

పేరేమో సింగిరెడ్డి
నారాయణరెడ్డి కాని
కులం కీళ్ళు విరిచే నా
కలానికీ సన్మానం

అంటూ ఒక గేయకవిత చదివారు; సభంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది.

అధికారభాషాసంఘం అధ్యక్షులుగా

నారాయణరెడ్డి గారు అధికార భాషాసంఘాధ్యక్షులుగా, 4–9–1981 నుండి 7–8–1985వరకు, తమ బాధ్యతలను నిర్వహించి, తెలుగు భాషా సేవ చేశారు. వారు అనేక ముఖ్య కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో కొన్ని ఇవి – వారి కాలంలో పధ్నాలుగు వేల తెలుగు టైపు రైటర్లు సేకరించడం జరిగింది. నలభైకి పైగా, ప్రభుత్వ శాఖల పదకోశాలకు రూపకల్పన జరిగింది. ‘కార్యాలయ పదావళి’, ‘నమూనా లేఖలు’ ప్రచురింపబడ్డాయి. జిల్లాస్థాయిలో తెలుగువాడుక 75% వరకు పెరిగింది. సాంకేతికంగా తెలుగు పరిపుష్టం చేయబడింది.

సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా

ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య నారాయణరెడ్డిగారిని, దేశంలో ప్రథమ సార్వత్రిక విశ్వవిద్యాలయమైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా నియమించింది. వారు ఆ పదవిలో 8.8.1985 నుండి 20.6.1989 వరకు, తమ విధులను సమర్థంగా నిర్వహించారు. వారి ఈ ఉపాధ్యక్షపదవి నిర్వహణ సమయంలో, విశ్వవిద్యాలయం కోసం, జూబిలీ హిల్స్ లో 54 ఎకరాల స్థలం కేటాయింపు పొందడం జరిగింది; జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల భవనాల డిజైన్ల పోటీ నిర్వహింపబడింది; జిల్లాలలో 57 అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. విద్యార్థుల సంఖ్య 50వేలు దాటింది. 1070 ముద్రిత పాఠాలకూ, 175 ఆడియో పాఠాలకూ, 103 వీడియో పాఠాలకూ రూపకల్పన జరిగింది. 28.3.1987 నాడు జరిగిన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ పాఠక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా

అనంతరం – ఆచార్య నారాయణరెడ్డిగారు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవిని 21.6.1989 నుండి 4.11.1992 వరకు నిర్వహించారు. వారి నిర్వహణకాలంలో విశ్వవిద్యాలయానికి యు.జి.సి. గుర్తింపు లభించింది. హైదరాబాదు పబ్లిక్ గార్డెన్లో ఇచ్చిన స్థలంలో విశ్వవిద్యాలయ భవన నిర్మాణం జరిగింది; భవన ప్రవేశం కూడా 31.1.1990 నాడు జరిగింది. కూచిపూడిలోని కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకువచ్చింది నారాయణరెడ్డిగారే. 24.8.1989 నాటి విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం తెలుగులో నిర్వహింపబడడం ఒక విశేషం. ఆ స్నాతకోత్సవంలో, అప్పటి ఛాన్స్ లర్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు పాల్గొన్నారు. భారత ఉప రాష్ట్రపతి డా. శంకర్ దయాళ్ శర్మ గారు, ముఖ్య అతిథిగా విచ్చేశారు. 7.7.1991నాడు జరిగిన రెండవ స్నాతకోత్సవంలో, నాటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావుగారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. నారాయణరెడ్డి ఉపాధ్యక్ష పదవీకాలంలోనే 30 మంది ప్రముఖులపై వీడియో డాక్యుమెంటేషన్ జరిగింది; 150కి పైగా ఉత్తమ గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. 1990 మార్చి 10, 11, 12 తేదీలలో బెంగుళూరులో ‘మూడవ అఖిల భారత తెలుగు మహాసభలు’ నిర్వహింపబడ్డాయి. అంతేకాక, మారిషస్ లో 1990 డిసెంబర్ లో ‘‘మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు’’నిర్వహించింది ఈ తెలుగు విశ్వవిద్యాలయమే. సాహిత్యం – కళలు – సంస్కృతి రంగాలలో ‘విశిష్ట పురస్కారం’ ఏర్పాటూ, విస్తరణ సేవా విభాగం ద్వారా పూర్వం ఉన్న ఐదు అకాడమీల కర్తవ్యాల నిర్వహణా, నారాయణరెడ్డిగారి కాలంలోనే జరిగాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉంటూనే ఆచార్య నారాయణరెడ్డిగారు, రెండు నెలలకు పైగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు.

భాషా సాంస్కృతిక సలహాదారుగా

ఆ తరువాత, ఆచార్య నారాయణరెడ్డిగారు ‘భాషా సాంస్కృతిక సలహాదారు’గా 5.11.1992నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో సమున్నత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో వారు, ఆధునిక దృశ్యశ్రవణ–సాంకేతిక విజ్ఞానం నింపుకునే చరిత్ర, సాహిత్య, సంగీత, నృత్యనాటక, చిత్రకళ, శిల్పకళ, జానపద, గిరిజన విభాగాలూ, ప్రదర్శనశాలలూ, రంగస్థలాలూ, డాక్యుమెంటేషన్ విభాగమూ మొదలైనవి ఒకేచోట ఉండేలాగా, మన రాజధాని హైదరాబాదులో, ఒక సర్వాంగీణ కళాప్రాంగణం–‘కళానికేతన్’ (కల్చరల్ కాంప్లెక్స్) నిర్మాణానికి సంబంధించిన పథకం ప్రభుత్వానికి సమర్పించారు. ఒకవేళ ఈ పథకం ఆచరణలోకి వస్తే అందంగా ఆదర్శప్రాయంగా తెలుగు కళారంగం సాంస్కృతిక వైభవ ప్రదర్శకంగా భాసిస్తుండేది.

సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా

ఆచార్య నారాయణరెడ్డిగారు ఆ తరువాత 1997 జులై నుండి ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి’ అధ్యక్ష పదవిని చేపట్టారు. వారు ఆ పదవిలో 12.7.2004 వరకు ఉండి, తమ విధులను జయప్రదంగా నిర్వహించారు. కాబినెట్ మంత్రి ప్రతిపత్తి ఉన్న ఉన్నత పదవి అది. సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, నారాయణరెడ్డిగారు విలక్షణ కార్యక్రమాలను రూపొందించి నిర్వహించారు; సాంస్కృతిక సంస్థలకు విశేష స్ఫూర్తిని కలిగించారు; అన్ని కళారంగాల వారికి మార్గదర్శిగా నిలిచారు; సాంస్కృతిక విధానంపై ఒక జాతీయ సదస్సును నిర్వహించారు; ‘సాంస్కృతిక వికాసోత్స’వాన్ని జరిపి రాష్ట్రంలోని 73 ప్రముఖ సంస్థలు, సాంస్కృతిక వికాసానికి చేసిన 103 సూచనలను స్వీకరించారు; ‘హంస’ పురస్కారాలను ఏర్పాటు చేశారు; ముప్ఫైవేల రూపాయల నగదుతో, బంగారుపూతతో స్వర్ణహంస ప్రతిమ, ప్రశంసాపత్రం – శాలువాతో ఈ పురస్కారం జరిగేది. ఈ పురస్కారాలను ఆనాడు కళారంగాలన్నీ ప్రతిష్ఠాత్మకమైనవిగా పరిగణించాయి. వారి కాలంలోనే నవల, కథానిక, పద్యం, గేయం, వచన నాటకం, సాహిత్య విమర్శ, ప్రసారమాధ్యమ రచనా విధానాలు – వంటి ఎనిమిది ప్రక్రియలలో ‘‘రచయితల అధ్యయన శిబిరాలు’’ నిర్వహింపబడినాయి. ‘సమైక్య రాగాత్మ’ అనే పేరుతో – కర్ణాటక, హిందుస్తానీ, అరబిక్, పాశ్చాత్య సంగీత సంప్రదాయాల సామ్యం నిరూపింపబడింది. ఇదొక అపూర్వ కార్యక్రమం. కేవలం ప్రతిభామూర్తులైన నారాయణరెడ్డిగారు మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహింపగలిగారు. మరో విశేషం ఏమిటంటే – ‘లయసంగమం’ అనే పేరుతో – పది చర్మవాద్యాల లయ గతుల సమ విన్యాసాన్ని ప్రదర్శింపజేశారు వారు. ఇంకా – పద్య నాటకోత్సవాలు, గిరిజన భాషా సాహిత్యసభలు, రాష్ట్ర స్థాయి చిత్రలేఖన శిల్పకళల పోటీలు నిర్వహింపబడ్డాయి.

రాజ్యసభ సభ్యులుగా

ఆచార్య నారాయణరెడ్డిగారు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే భారత రాష్ట్రపతి వారిని రాజ్యసభ సభ్యునిగా నామనిర్దేశం చేశారు. రాజ్యసభా సభ్యత్వ కాలపరిమితి ఆరేళ్ళు కాబట్టి, నారాయణరెడ్డిగారు 27.8.1997 నుండి 26.8.2003 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. దక్షిణభారతం నుండి రాజ్యసభ సభ్యులుగా నియమింపబడిన ప్రథమకవి నారాయణరెడ్డిగారే కావడం విశేషం. వారితో పాటు రాజారామన్న, షబానాఅజ్మీ కులదీప్ నయ్యర్ – వంటి ప్రసిద్ధులు పన్నెండుమంది రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు.

రాజ్యసభ సభ్యులుగా నారాయణరెడ్డిగారు సభలో 624 ప్రశ్నలు వేశారు. వాటిలో ప్రధాన ప్రశ్నలూ అనుబంధ ప్రశ్నలూ ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని – గాంధీజీని న్యూనపరుస్తూ ‘మాక్సిమ్’ పత్రిక ప్రచురించిన కథనం; దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాంస్కృతిక వికాసానికి దోహదకరంగా ఆర్థిక సహాయం చేసే నిమిత్తం ఒక ‘సాంస్కృతిక నిధి’ని ఏర్పాటు చేయడం; కంప్యూటర్లలో భారతీయ భాషల వినియోగం; సంస్కృత భాషా వ్యాప్తికి తోడ్పడే నిమిత్తం కేంద్ర విశ్వవిద్యాలయాలలో ‘సంస్కృత పీఠాలు’ ఏర్పాటు చేయడం; ఇతర దేశాలలో తెలుగువారి కోసం ఆకాశవాణి ప్రసారాలు ఏర్పాటు చేయడం; హైదరాబాదులోని ‘ప్రాగాటూల్స్’ సంస్థకు నిర్వహణ మూలధనం మంజూరు చేయడం.

రాజ్యసభ సభ్యులుగా నారాయణరెడ్డిగారు 32 సార్లు ‘ప్రత్యక ప్రస్తావనలు’ చేశారు. ‘ప్రస్తావన’– అనేది చాలా విశేషమైన సభా కార్యక్రమం. వారు చేసిన ప్రస్తావనలలో ముఖ్యమైనవి కొన్ని – ఉదాహరణకు –

1) గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ లో గాంధీజీ చదివిన ఆల్ ఫ్రెడ్ హైస్కూల్ దుస్థితి; దాని పేరు ఇప్పుడు ‘మోహన్ దాస్ గాంధీ హైస్కూల్’. అందులో ఉన్న 18 గదులలో 10 గదులకు తలుపులు, కిటికీలు లేవు. ప్రార్థనా మందిరాన్ని పనికిరాని వస్తువులుంచేందుకు వాడుతున్నారు. దాని మరమ్మత్తు కోసం, నారాయణరెడ్డిగారు తమ ఎం.పి.లాడ్స్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలిస్తానని ప్రకటించారు.

2) ఒరిస్సా రాష్ట్రం ‘కటక్’లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ‘జానకీనాథ్ భవనం’ దుఃస్థితిని, నారాయణరెడ్డిగారు సభలో ప్రస్తావించారు. వారి ప్రస్తావనను ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్, శ్రీ రాజారామన్న, శ్రీ చిత్తరంజన్ – వంటి ప్రముఖులు బలపరిచారు.

3) మరో విశేష ‘ప్రస్తావన’ ఏమిటంటే – నారాయణరెడ్డిగారు ఆస్ట్రేలియా దేశంలో – మెల్ బోరన్ సమీపంలో ఉన్న ‘గోల్డ్ మ్యూజియం’ను దర్శించారు. ఆ మ్యూజియంలో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలపై లక్ష్మీదేవి చిత్రాలున్నాయి. వాటిని గురించి తెలిపే అసభ్యకర వివరణపై నారాయణరెడ్డిగారు, సభలో ప్రత్యేక ప్రస్తావన చేశారు. ‘‘మహావిష్ణువు అర్థాంగి లక్ష్మీదేవి; సంపద సౌభాగ్యాల అధిదేవత; ఆమె జగన్మాత; సప్తమాతృకలలో ఒకరుగా పవిత్ర స్థానం వహించిన ఆ దేవతను, ‘విషయాసక్తగా’, ‘విమోహకమూర్తి’గా (‘సెన్సుయస్ లక్ష్మి’, ‘సెడక్టివ్ లక్ష్మి’గా) వర్ణించడం అత్యంత అభ్యంతరకరం’’ – అని నారాయణరెడ్డిగారు సభలో అన్నారు. వారి అభ్యంతరం ఆధారంగా, తర్వాత ఆ నాణేలపై గల అసభ్య వివరణను తొలగించడం జరిగింది.

4) భారతీయ జాతీయపతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యగారి గృహం – కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో ఉంది. ఆ ఇంటిని పశువులపాకగా వాడుతున్నారు. ఈ విషయాన్ని సభలో ప్రస్తావించి, పింగళి వెంకయ్య ఇంటిని ‘స్మారకచిహ్నం’గా గుర్తించి జీర్ణోద్ధరణ చేయాలనీ, ఆయనకు తగిన గౌరవ ప్రతిపత్తి ఇవ్వాలనీ నారాయణరెడ్డిగారు సూచించారు.

నారాయణరెడ్డిగారు రాజ్యసభ సభ్యులుగా ప్రతిపాదించిన బిల్లులలో ప్రధానమైంది ‘మాతృభాష’ (నిర్బంధ బోధన – అధ్యయనం) బిల్లు. ఇది విద్యార్థి చదివే భాషలలో మాతృభాష తప్పక ఉండాలని నిబంధిస్తుంది. భారత రాజ్యాంగం ‘8’వ షెడ్యూలులో పేర్కొన్న భాషలకు, దీనిని వర్తింపజేయాలని, నారాయణరెడ్డిగారు తెలియజేశారు.

నారాయణరెడ్డిగారు, అధికార భాష, శాస్త్ర సాంకేతిక – పర్యావరణ – అటవీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, సమాచార ప్రసార సంబంధాలైన పార్లమెంటు సంఘంలో సభ్యులుగా తమ విధులను సముచితంగా నిర్వహించారు.

16.3.2003 నాడు మొరాకోలో జరిగిన ‘ఇంటర్ పార్లమెంటరీ యూనియన్’ మహాసభలో నారాయణరెడ్డిగారు భారత ప్రతినిధి వర్గ సభ్యునిగా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో పారిస్ లోని ‘యునెస్కో’ కార్యాలయాన్ని సందర్శించి, హైదరాబాదుకు ‘‘ప్రపంచ వారసత్వ నగర ప్రతిపత్తి’’ ప్రకటించాలని సవివర నివేదిక అందజేశారు.

రాజ్యసభ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాలకు నారాయణరెడ్డిగారికి ‘ఎంపిలాడ్స్’, పథకం కింద 11 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించింది. నామినేటు చేయబడిన సభ్యునిగా నారాయణరెడ్డిగారు వివిధ పథకాలకు ఆ నిధి నుండి ఆర్థిక సహాయం చేశారు. ఉదాహరణకు కొన్ని –

కటక్ లో నేతాజీ జన్మించిన ‘జానకీనాథ్’ భవనం పునరుద్ధరణకూ, ఒరిస్సా వరద బాధితుల సహాయనిధికీ, గుజరాత్ భూకంప బాధితుల సహాయనిధికీ, షోలాపూర్లోని పద్మశాలి విద్యాసంస్థ భవన నిర్మాణానికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నీరు మీరు’ పథకానికీ, కరీంనగర్లో ‘సారస్వత సదన్’ భవన నిర్మాణానికీ, వేములవాడలో ‘సాహితీసదన్’ భవన నిర్మాణానికి, కరీంనగర్ వట్టెపల్లెలో ‘అంబేడ్కరు కమ్యూనిటీ’ హాలు నిర్మాణానికీ, సిరిసిల్లలో ‘పురపాలక సంస్థ ఆడిటోరియం’ నిర్మాణానికీ, హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు పండిత శిక్షణ కళాశాల భవన నిర్మాణానికీ, వేగేశ్న వికలాంగుల సంస్థ భవన నిర్మాణానికీ, కడపలో సి.పి. బ్రౌన్ గ్రంథాలయ భవన నిర్మాణానికీ, నారాయణరెడ్డిగారు తమ ఎంపిలాడ్స్ నిధుల నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సినీ గీత రచయితగా

నారాయణరెడ్డిగారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే 1962లో శ్రీ నందమూరి తారక రామారావుగారి ఆహ్వానంపై చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. వారి తొలి సినీగీతం – ‘‘నన్ను దోచుకొందువటే’’. ‘గులేబకావళి కథ’ చిత్రంలోని పాటలన్నీ వారు వ్రాసినవే. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి ఇటీవలి ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు, నారాయణరెడ్డిగారు మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించి, చలనచిత్ర జగత్తులో తమ ప్రత్యేకతను భద్రపరచుకున్నారు. పాటలు రచించడమే కాదు ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ – అనే శీర్షికతో వారు తమ పాటలకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి వ్యాఖ్యానాలు వ్రాశారు. ఆ వ్యాఖ్యానాలు రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురితమయ్యాయి. వారి పాటలు సాహిత్య మూల్యాలను పోషించాయి.  నారాయణరెడ్డిగారు ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. వారు 50 మందికి పైగా సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ఆ సంగీత దర్శకులలో తెలుగువారే కాక శంకర్ జయకిషన్, సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, రవీంద్రజైన్, ఉషాఖన్నా, బప్పీలహరి – వంటి ప్రముఖ హిందీ సంగీత దర్శకులు కూడా ఉన్నారు. ఘంటసాల గళంలో నారాయణరెడ్డి గీతాలధికంగా వచ్చాయి. వారి చలన చిత్ర గీతాలపై, ప్రముఖ సాంస్కృతిక సంస్థలు, అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నారాయణరెడ్డిగారి చలనచిత్ర గీతాలెన్నో బహుమతులందుకున్నాయి. నారాయణరెడ్డిగారు – మూగజీవులు, శభాష్ పాపన్న, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర చిత్రాలలో కావ్యసంబంధమైన పాత్రలలో కనిపించారు. నారాయణరెడ్డిగారు చిత్రగీతాలు వ్రాయడమే కాదు, విలక్షణమైన తమ గళంతో తమ బాణీలో పాడగల ప్రతిభావంతులు.

కవిగా

ఆచార్య నారాయణరెడ్డిగారు సామాజిక చైతన్య ప్రబోధాన్ని తమ కవిత్వ ప్రధాన లక్ష్యంగా చేసికొని, ప్రగతిశీల మానవతావాదాన్ని ఎంచుకొని, ఆనాటి ‘‘నవ్వని పువ్వు’’ (1953) మొదలుకొని, ఈనాటి – ‘అలలెత్తే అడుగులు’ (2013), నింగికెగిరే చెట్ట్ల్లు (2014) వరకు 18 ప్రక్రియలలో సుమారు 90 గ్రంథాలు రచించారు.

డా. సి. నారాయణరెడ్డిగారు సంప్రదాయం జీర్ణించుకున్నవారు కాబట్టి తెలుగు సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు. కథాగేయ కావ్యాలు సృష్టించడంలో, గేయ సూక్తులు రచించడంలో, ‘మాకందా’లను అందించడంలో, వచన కవిత్వంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో ‘ప్ర’పంచపదులను నిర్మించడంలో – తెలుగు గజళ్ళకు మానవీయ దృక్పథాన్ని అనుసంధించడంలో, ప్రతీకాత్మకంగా వచన కవితలో ‘ఇతిహాస కావ్యాన్ని’– ‘విశ్వంభర’ను నిర్మించడంలో, ‘మట్టీ–మనిషీ–ఆకాశం’ వంటి వచనకవితా ‘కావ్యేతి హాసాన్ని’ సంవిధానసంపన్నంగా సృజించడంలో, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ వంటి స్వీయ చలన చిత్ర గీతికా వ్యాఖ్యా రచనంలో,  ఋతువర్ణనలను జీవితానికి సమన్వయిస్తూ ‘ఋతుచక్రం’ వంటి కావ్యరచనలో గేయ కావ్యాలకు పద్య కావ్య ప్రౌఢిని, ప్రామాణికతనూ సంతరించడంలో, శతశతాధిక నూతన పదబంధ కల్పనంలో మహాకవి నారాయణరెడ్డి ప్రయోగశీలం ప్రస్ఫుటమవుతుంది.

డా. సి. నారాయణరెడ్డిగారు మహావక్తలు, విద్యావేత్తలు. వారి వాచిక ప్రతిభ అనన్య సాధ్యం. వారి కలం ఎంత శక్తిమంతమైనదో, వారి గళం కూడా అంత సమ్మోహనాత్మకమే. వారు నిత్యసభావ్రతులు. వక్తృత్వ ప్రతిభకు ప్రాణం భాష. ఆ భాష నారాయణరెడ్డిగారి – ఇంటి వివృత గవాక్షం; వారి కంటి వినిర్మల కటాక్షం; భాష వారు ‘‘తెచ్చుకున్న తీయని వరం’’; వారు కట్టుకున్న జీవన గోపురం. నారాయణరెడ్డిగారి ఉపన్యాసం శబ్దమాధురినీ, భావగాంభీర్యాన్నీ, కవితాపరిమళాన్నీ ఒలికిస్తుంది. కళాశాలల వార్షికోత్సవాలు, వివిధ సాహితీ సాంస్కృతిక  సంస్థల సభలూ, గ్రంథావిష్కరణోత్సవాలు, అభినందన సభలు, సదస్సులు, మహనీయుల జయంతులూ, వర్థంతులూ, అఖిల భారత తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు సభలు – అన్నీ నారాయణరెడ్డిగారి వక్తృత్వ పటుత్వాన్ని, వారి వాచస్పత్యాన్నీ అనుభవించి ఆనందించినవే. సరస్వతి నారాయణరెడ్డి ముఖవాసిని. వారు పుంభావ భారతులు.

అందుకున్న పురస్కారాలు

నారాయణరెడ్డిగారి కావ్యాలు వివిధ పురస్కారాలనందుకున్నాయి. వారి ‘దివ్వెల మువ్వలు’ నవ్యసాహితీ సమితి వారి పురస్కారాన్నీ, ‘ఋతుచక్రం’ కావ్యం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డునూ, ‘మంటలూ మానవుడూ’ కావ్యం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతినీ అందుకున్నాయి. వారి ‘విశ్వంభర’ కావ్యం భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా) పురస్కారాన్నీ, కుమారన్ ఆసన్ (కేరళ) అవార్డునూ, సోవియట్  లాండ్ నెహ్రూ అవార్డునూ, రాజా–లక్ష్మీ అవార్డునూ అందుకున్నది. వారి ‘విశ్వంభర’ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

ఆచార్య నారాయణరెడ్డిగారు సాహితీమూర్తిగా అనేక  సత్కారాలను పొందారు. 1976లో మీరట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తోనూ, 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతోనూ, నాగార్జున, కాకతీయ, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతోనూ, భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ గౌరవాలతోనూ నారాయణరెడ్డిగారిని సత్కరించాయి. 

కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అత్యున్నతమైన విశిష్ట సభ్యత్వం (Fellow) అందుకున్నారు.

గ్రంథ స్వీకృతులు

సారస్వతమూర్తి అయిన ఆచార్య నారాయణరెడ్డిగారికి, రచయితలూ కవివరేణ్యులెందరో సౌహార్దంతో తమ గ్రంథాలను అంకితం చేశారు. డా. ముకురాల రామారెడ్డిగారి ‘దేవరకొండ దుర్గం’, డా. జె. బాపురెడ్డిగారి ‘చైతన్యరేఖలు’, డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారి ‘తెలుగువారి చలనచిత్రకళ’, శశాంక గారి ‘స్వరలహరి’, డా. ఎం.కె. రాముగారి ‘అంతర్మథనం’, డా. సి. ఆనందారామం గారి ‘తపస్వి’ శ్రీ విరించి గారి ‘నా కవనం’, డా. ఆర్. వసునందన్ గారి ‘గురుకులము’; ‘కలం కదిలితే...’; ‘ఆయుధం కవిత్వం’; డా. ఎన్. గోపిగారి ‘తంగెడుపూలు’, డా. ఎల్లూరి శివారెడ్డి గారి ‘సురవరం ప్రతాపరెడ్డి జీవితము–సాహిత్యము’, డా. అమ్మంగి వేణుగోపాల్ గారి ‘మిణుగురు’, శ్రీ రేగులపాటి కిషన్ రావుగారి ‘వాణిశ్రీ’, శ్రీమామిండ్ల రామగౌడు గారి ‘రస తరంగిణి’, డా. తిరుమల శ్రీనివాసాచార్యగారి ‘రవ్వల పతాక’, శ్రీ దూడం నాంపల్లి గారి ‘అభినందన చందనం’, డా. ముదిగొండ వీరభద్రయ్య గారి ‘మట్టీ మనిషీ ఆకాశం – వస్తు సంవిధానం’ – మొదలైన అనేక గ్రంథాలు నారాయణరెడ్డిగారికి అంకితం చేయబడ్డాయి. 

విస్తృత పర్యటనలు

ఆచార్య నారాయణరెడ్డిగారు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్ర సంఘాల ఆహ్వానంపై – ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, బెంగుళూరు, మైసూరు, భువనేశ్వర్, బరంపురం, షోలాపూర్, నాగపూర్, కొచ్చిన్ మొదలైన అనేక ప్రదేశాలలోని సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.<br><br>

నారాయణరెడ్డిగారు విదేశీ పర్యటన విస్తృతంగా చేశారు. వారు అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు, జపాను, రష్యా, కెనడా, ఇటలీ, డెన్మార్కు, థాయిలాండ్, యుగోస్లేవియా, గల్ఫ్ దేశాలూ, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, మారిషస్ మొదలైన దేశాలను సందర్శించారు. ఆయా దేశాలలోని తెలుగువారిని కలుసుకున్నారు. 1990లో యుగోస్టేవియాలోని ‘స్త్రూగా’లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో నారాయణరెడ్డిగారు భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. నలభై దేశాల కవులు ఈ సమ్మేళనంలో తమ కవితలు వినిపించారు. భారతదేశం గర్వింపదగిన మహాకవి నారాయణరెడ్డిగారు.

సాంస్కృతిక సంస్థలతో అనుబంధం

రాష్ట్రంలోనూ జంటనగరాలలోనూ ఉన్న ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థలన్నింటితో నారాయణరెడ్డిగారికి సన్నిహిత సంబంధముంది. ఆ సంస్థల వారు నారాయణరెడ్డిగారి కార్యక్రమాలలో సహకరిస్తున్నారు. ఉదాహరణకు – ‘రసమయి సంస్థ’ ‘‘శ్రీమతి సుశీలానారాయణరెడ్డి సాహిత్య పురస్కార సభ’’ను నిర్వహిస్తున్నది. ‘వంశీ’ సంస్థ జులై 29న నారాయణరెడ్డిగారి జన్మదినం సందర్భంగా గ్రంథావిష్కరణ సభ జరుపుతున్నది. కరీంనగర్లో నారాయణరెడ్డిగారి సాహిత్యాభిమానులు శ్రీ జి. లక్ష్మణరావు గారు ప్రతి సంవత్సరం ‘‘సినారె సాహిత్య పురస్కారం’’, ఉత్తమ కవితా సంపుటికి ప్రదానం చేస్తున్నారు. అలాగే – పాలకొల్లులో డా. గజల్ శ్రీనివాస్ గారు ‘సినారె కళాపీఠం’ నెలకొల్పి, ఏటా ‘సాహితీ పురస్కారం’ ఇస్తున్నారు. నారాయణరెడ్డిగారు 1969 నుండి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా సేవలందించారు. గతంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ‘స్రవంతి’ పత్రికకు వారు గౌరవ సంపాదకులుగా సేవ చేశారు.

అనువాదాలు

మహాకవి నారాయణరెడ్డిగారి రసవత్కావ్యాలూ కవితలూ అన్యభాషలలోని అనువాదమైనాయి. వారి ‘రామప్ప’ సంగీత రూపకం అన్ని భారతీయ భాషలలోనికి అనూదితమైంది.  శ్రీయుతులు డా. ఎన్.ఎస్. ప్రభాకరరావు, డా. అరిపిరాల విశ్వం, డా. అమరేంద్ర గారలు నారాయణరెడ్డిగారి కవితలను ఆంగ్లంలోనికి అనువదించారు. వారి ‘దివ్వెల మువ్వలు’ వంటి అనేక కవితలను, ‘దీప్కే నూపుర్ గా హిందీలోకి అనువదించారు ఆచార్య శ్రీరామశర్మగారు. మార్కండాపుర శ్రీనివాసుగారు ‘కొత్త ముఖం తొడుక్కో’ వంటి ఇరవై ఐదు కవితలను ‘హొసముఖ తొట్టుకొ’గా కన్నడంలోకి అనువదించారు. ‘మంటలూ మానవుడూ’  కావ్యాన్ని శ్రీ ఇళం భారతిగారు 1977లో ‘అనల్ కాట్రు’ అనే పేరుతో తమిళంలోకి అనువదించారు. ఆధునిక తెలుగు మహాకావ్యమయిన ‘విశ్వంభర’ను, డా. భీమ్ సేన్ నిర్మల్గారు 1984లో హిందీలోనికి అనువదించారు. డా. అమరేంద్రగారు 1986లో ‘విశ్వంభర’ను ఆంగ్లంలోకి అనువదించారు. నారాయణరెడ్డిగారి ‘ప్ర’పంచపదులు’ కావ్యాన్ని, ఆచార్య  రవ్వా శ్రీహరిగారు ‘ప్రపంచపదీ’గా సంస్కృతంలోనికి, శ్రీ గోవిందరాజు రామకృష్ణారావుగారు ‘ఎ పీస్ ఇంటూ విజ్డమ్’గా ఆంగ్లంలోనికి అనువదించారు. ‘సమూహంవైపు’ కావ్యంలోని 25 కవితా ఖండికలను, ఆచార్య ఎం. కులశేఖరరావు గారు – ‘టూవార్డ్స్ మల్టిట్యూడ్’గా ఆంగ్లంలోని కనువదించారు. నారాయణరెడ్డిగారి కావ్యాలు కొన్ని ఫ్రెంచి ఉరుదూ భాషలలోనికి అనువాదాలయ్యాయి.

బిరుదులు

మహాకవి నారాయణరెడ్డిగారి మహిత కవిత్వ వ్యక్తిత్వాలను ఎందరో ప్రశంసించారు. ‘‘నవ్యగేయ మహాకవి, గేయకవి సమ్రాట్, పుంభావసరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవితా మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వనిచక్రవర్తి, ప్రజాకవి, నవకవితా సమ్రాట్, చలనచిత్ర కవి చక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథులు, నవరసాలమూర్తి’’వంటి ప్రశంసలతో సహృదయ ప్రపంచం నారాయణరెడ్డిగారిని సన్మానించింది. బిరుదులకు లొంగిపోయే వ్యక్తిత్వం కాదు నారాయణరెడ్డిగారిది. స్తుతులెన్ని చేసినా, మతిని పోగొట్టుకోక, ప్రశంసలు ప్రగతి కార్యసాధనకు హెచ్చరికలు అనీ, ప్రాతిపదికలు అనీ, భావించి, ఆగకుండా సాగిపోయే నిత్య చైతన్యమూర్తి నారాయణరెడ్డిగారు.

డా. సి. నారాయణరెడ్డిగారి సాహిత్యంపై జరిగిన పరిశోధనలు

పిహెచ్.డి.

క్రమ సంఖ్య టైటిల్ పరిశోధకులు పర్యవేక్షకులు విశ్వవిద్యాలయం పేరు
1 సినారె కృతులు ఎం.ఎల్. గురప్ప టి.వి. సుబ్బారావు 1980 బెంగుళూరు
2 సినారె కవిత్వము-సంప్రదాయము-ప్రయోగము జి. గోవర్థన్ కె. గోపాలకృష్ణారావు 1984 ఉస్మానియా
3 సినారె సినిమా పాటలు- సమగ్ర పరిశీలన వి.ఎల్. నరసింహారావు టి. గౌరీశంకర్ 1998 తెలుగు
4 సినారె కవిత్వం – ప్రక్రియా వైవిధ్యం యం. విజయకుమార్ కె. సంజీవరావు 2004 తెలుగు
5 సినారె కవితా పరిణామం జి. నాసరరెడ్డి సి. ఆనందారామం 1987 హైదరాబాదు
6 సినారె కవిత – లావణ్యకత ఎం.కె. రాము ఎ. శివారెడ్డి 2002 ఉస్మానియా
7 సినారె గేయ కావ్యాలు ఎస్. రవీందర్ పి. సుమతీనరేంద్ర 1996 ఉస్మానియా
8 సినారె గేయకవిత్వం వస్తుభావ నవ్యత కె. జ్యోత్స్నప్రభ ఎ. భూమయ్య 2007 కాకతీయ
9 సినారె కవిత్వ దర్శనం-చారిత్రక కావ్యాలు-స్త్రీ పాత్రలు ఎన్. ప్రభావతి దేవి ఎ. భూమయ్య 2011 కాకతీయ

ఎం.ఫిల్.

10 సినారె జలపాతం-ఒక పరిశీలన ఎం. పద్మజ ఎన్. అనంతలక్ష్మి 1996 ఉస్మానియా
11 సినారె గేయ కథాకావ్యాలు కె. చెంగారెడ్డి జాస్తి సూర్యనారాయణ 1983 శ్రీ వేంకటేశ్వర
12 కర్పూర వసంతరాయలు కావ్యానుశీలన ఎం. సత్యనారాయణ ఎ. పున్నారావు 1983 నాగార్జున
13 కర్పూర వసంతరాయలు కావ్యానుశీలన ఎం. సిద్ధన్న సి. రమణయ్య 1994 తెలుగు
14 జాతిరత్నం కావ్యానుశీలన బి. మాధురి ఎస్. జయప్రకాశ్ 1998 మధురై
15 మంటలు-మానవుడు రచన వైశిష్ట్యం కె. ఆదినారాయణ హెచ్.ఎస్. బ్రహ్మానంద 1990 శ్రీకృష్ణదేవరాయ
16 మనిషి- చిలుక అనుశీలన కె. పద్మావతి సి. రమణయ్య 1992 తెలుగు
17 భూమిక సమగ్ర పరిశీలన ఆర్. వసునందన్ వి. ఆనందమూర్తి 1982 ఉస్మానియా
18 సమకాలీన కవిత్వంలో మానవతావాదం: విశ్వంభర ఆర్. వసునందన్ ఐ. కృష్ణమూర్తి 1987 ఉస్మానియా
19 విశ్వంభర-ఇతిహాసం జె. శ్రీహరి పి.ఎల్. శ్రీనివాసరెడ్డి 1985 శ్రీకృష్ణదేవరాయ
20 ఆధునికేతిహాసంగా విశ్వంభర సిహెచ్. కిరణ్మయి సి. ఆనందారామం 1991 హైదరాబాదు
21 కవిత నా చిరునామ సిహెచ్. మల్లికార్జునాచారి వి. ఆనందమూర్తి 1990 ఉస్మానియా
22 నడక నా తల్లి సిహెచ్. శ్రీనివాసరావు కె. రుక్నుద్దీన్ 1994 ఉస్మానియా
23 ప్రపంచపదులు- సామాజిక రాజకీయ సాహిత్య నేపథ్యం జి. గీతావాణి సి. ఆనందారామం 1993 హైదరాబాదు
24 ప్రపంచపదులు-అనుశీలన ఎం. విజయకుమార్ సి. రమణయ్య 1994 తెలుగు
25 సినారె ‘కలంసాక్షిగా’ కావ్యం వస్తురూప విశ్లేషణ జి. స్వామి వై. సుధాకరరావు 1999 తెలుగు
26 గదిలో సముద్రం-సినారె కవితాతత్త్వం జె.ఎస్.ఎల్. జి. అరుణకుమారి 2001 హైదరాబాద్
27 ఆరోహణ-ఒక పరిశీలన కె. జ్యోత్న్సప్రభ పి. సుమతీనరేంద్ర 1994 ఉస్మానియా
28 సినారె దూరాలను దూసుకొచ్చి-ఒక పరిశీలన జి. వెంకటలక్ష్మి ఎల్లూరి శివారెడ్డి 2003 ఉస్మానియా


Awards